
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని క్వారీలు, స్టోన్ క్రషర్లలో మంగళవారం రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో రోలుగుంట తహసీల్దార్ నాగమ్మ, ఆర్ఐ చిన్నయ్యపడాల్, మైనింగ్ ఆర్ఐ సత్తిరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు వడ్డిప గ్రామంలోని తమరాన అప్పులనాయుడు స్టోన్ క్రషర్, కొవ్వూరులోని సహస్ర క్వారీ, అలాగే రోలుగుంట గ్రామంలోని పలు స్టోన్ క్రషర్లను పరిశీలించారు. ఆయా క్వారీల లీజుదారులను పిలిపించి లీజు అనుమతి పత్రాలు, సర్వే నంబర్లు, లీజు సరిహద్దులు తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.అనుమతి పొందిన విస్తీర్ణానికి మించి తవ్వకాలు జరుగుతున్నాయా? లీజు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేపట్టారా? అనే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని క్వారీలు, స్టోన్ క్రషర్లలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు పూర్తిస్థాయి తనిఖీలు కొనసాగనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. తనిఖీలు పూర్తయిన అనంతరం సమగ్ర నివేదికను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నట్లు వెల్లడించారు.
