
కాకినాడ జిల్లావాణి ప్రతినిధి : రమణయ్యపేట లో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల కాకినాడ- సామర్లకోట ప్రధాన రహదారిపై గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్కును బిడ్డను ఎత్తుకొని నియంత్రించిన జయ శాంతిని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ రంగంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ జయశాంతి సామర్లకోట రహదారిలో ట్రాఫిక్ స్తంభించి అంబులెన్సులు నిలిచిపోవడంతో తన డ్యూటీ కాకపోయినా సామాజిక బాధ్యతగా బిడ్డని ఎత్తుకొని ట్రాఫిక్కును క్లియర్ చేయడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ట్రాఫిక్ సమస్య నుంచి అంబులెన్స్ ని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చిన జయ శాంతి కి దంత వైద్య సంరక్షణ పరంగా ఎటువంటి సమస్య వచ్చినా మా శ్రీ సత్య దంత వైద్యశాల లో ఉచితంగా వైద్యం అందజేస్తామని డాక్టర్ అడ్డాల తెలిపారు.పోలీసు విశ్రాంతి ఉద్యోగి బుద్ధరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం పోలీసు బాధ్యతని అన్నారు. ఆ బాధ్యతను అంకితభావంతో నిర్వహించిన జయశాంతి పోలీస్ శాఖకు వన్నెతెచ్చారని అన్నారు. గ్రంధాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీకి చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి అంకిత భావంతో చేసిన విధులకు సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరగడం కాలనీ వాసులకు గర్వకారణం అన్నారు. జయ శాంతి మాట్లాడుతూ అంబులెన్స్లు ట్రాఫిక్కులో చిక్కుకుపోవడంతో ఒక బాధ్యతాయుతమైన కానిస్టేబుల్ గా ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగిందన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో హోం మంత్రి వంగల వనిత, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, జిల్లా ఎస్పీ తదితర అధికారులు తనను అభినందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో జయ శాంతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పబ్నీడి చలపతిరావు, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు.
