
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఆరోగ్యకరమైన పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ చి. లచ్చన్న రైతులకు సూచించారు. రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా లచ్చన్న మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపు నివారణ మందుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని సూచించారు. నవధాన్యాలను (పి ఎమ్ డి ఎస్) ఉపయోగించడం ద్వారా భూమి సారాన్ని పెంచడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. నేల ఆరోగ్యం మెరుగుపడితే ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు.వరి సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం సంభవించినప్పుడు నిబంధనల మేరకు బీమా పరిహారం పొందే అవకాశం ఉంటుందని వివరించారు.విత్తన గుళికల తయారీపై ప్రదర్శనరైతులకు వరి విత్తన గుళికల తయారీ విధానాన్ని సామూహికంగా డెమో ద్వారా చేసి చూపించారు. ముందుగా వరి విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి, అనంతరం మట్టి పొడి, ఘనజీవామృతం పొడి, కట్టెల బూడిదను వరుసగా కలుపుతూ విత్తనాలు గుళికల రూపంలో తయారయ్యే విధానాన్ని వివరించారు.తయారైన విత్తన గుళికలను దమ్ము చేసిన పొలంలో లేదా పొడి దుక్కిలో విత్తుకోవచ్చని తెలిపారు. ఈ విధానం వల్ల విత్తనంలో తేమ నిల్వ ఉండటంతో పాటు ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి, విత్తనాలు వృథా కాకుండా మొలక శాతం మెరుగుపడుతుందని వివరించారు.బీఆర్సీ ఓనర్ వై. రాజుబాబు, వై. వెంకటరమణలు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తాము అనుసరిస్తున్న విధానాలను రైతులకు వివరించారు. ఈ పద్ధతులపై రైతులు ఆసక్తి వ్యక్తం చేస్తూ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని, వరి విత్తన గుళికల విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ చి. లచ్చన్న, ఐసీటీ ఎన్ఎఫ్ఏ చిన్న, ట్రాన్స్ఫర్ ఎన్ఎఫ్ఏ నాగమణి, డివిజన్ ఎంటీ వరలక్ష్మి, మండల ఇన్చార్జి గంగరాజు, ఐసీఆర్పీలు, టీఐసీఆర్పీలు, కొవ్వూరు గ్రామ రైతులు పాల్గొన్నారు.