HomeUmmadi Alluri Zillaశబరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఇంచార్జి కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్

శబరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఇంచార్జి కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: పోలవరం జిల్లా పరిధిలోని కూనవరం శబరి నది వంతెన వద్ద శుక్రవారం రాత్రి శబరి నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పోలవరం జిల్లా ఇంచార్జి కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్‌ కలెక్టర్ శుభం నొక్వాల్ పరిశీలించారు. శబరి నదిలో నీటిమట్టం, వరద పరిస్థితి, పరివాహక ప్రాంతాల్లోని పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. ప్రస్తుతం కూనవరం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి సాధారణంగానే ఉన్నప్పటికీ, ఒడిశా రాష్ట్రంలోని శబరి నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆకస్మికంగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.శబరి నది నీటిమట్టం, వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, నీటిమట్టంలో మార్పులు చోటుచేసుకున్న వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువలు, రహదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వరద పరిస్థితి తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నదులు, వాగులు దాటే ప్రయత్నాలు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తహశీల్దార్లు, పోలీసు, పంచాయతీరాజ్, వైద్య, విద్యుత్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అవసరమైన సహాయక సామగ్రి, రవాణా వాహనాలు, పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలు అధికార యంత్రాంగం నుంచి వచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని, శబరి నది, వాగులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, వదంతులను నమ్మవద్దని సూచించారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా యంత్రాంగం తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments