
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026లో భాగంగా పోలవరం జిల్లాలో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో, ఆయా పోలింగ్ ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటిస్తూ , ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొదటి విడత పోలింగ్ నవంబర్ 26వ తేదీన, రెండో విడత పోలింగ్ నవంబర్ 29వ తేదీన నిర్వహించనున్న ట్లు పేర్కొన్నారు. మొదటి విడతకు సంబంధించి నవంబర్ 25, 26 తేదీల్లో, రెండో విడతకు సంబంధించి నవంబర్ 28, 29 తేదీల్లో ఆయా విడతల్లో పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలుగా వినియోగించే భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలకు మాత్రమే స్థానిక సెలవు వర్తిస్తుందని తెలిపారు. అయితే ట్రెజరీలు, సబ్ ట్రెజరీలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.అదేవిధంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ఆయా విడతల పోలింగ్ రోజున స్థానిక సెలవు ప్రకటించా మన్నారు. పోలింగ్ ప్రాంతాల్లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కూడా పోలింగ్ రోజున నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం–1881 ప్రకారం సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలు పోలింగ్ రోజున తమ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు కల్పించాలని లేదా పోలింగ్ సమయంలో సుమారు మూడు గంటల పాటు ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించాలని సూచించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కూడా పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు కల్పించాలని తెలిపారు.అయితే ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బందికి, అత్యవసర సేవల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ సెలవులు వర్తించవని, వారు సంబంధిత అధికారులు జారీ చేసిన ఆదేశాల మేరకు విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు.ఈ ఉత్తర్వులను సంబంధిత పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, ఇతర సంస్థల యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లి అమలు జరిగేలా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, కార్మిక శాఖ ఉప/సహాయ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీలు, వార్డులకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలు లేదా వార్డులు, పోలింగ్ జరగని ప్రాంతాలకు ఇవి వర్తించవని స్పష్టం చేశారు.
© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.