Zilla Vaani
ప్రింట్ తేదీ: నవంబర్ 26, 2026, 4:54 మధ్యాహ్నం | ప్రచురణ తేదీ: నవంబర్ 26, 2026, 2:55 ఉదయం

రంపచోడవరం ఎంపీడీఓ పివివిఎస్. ప్రసాద్‌ పై పోలింగ్ సిబ్బంది అసహనం, షోకాజ్ నోటీసు జారీ

రంపచోడవరం ఎంపీడీఓ పివివిఎస్. ప్రసాద్‌ పై పోలింగ్ సిబ్బంది అసహనం, షోకాజ్ నోటీసు జారీ

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రంపచోడవరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు నియమితులైన పోలింగ్ సిబ్బందికి పంపిణీ కేంద్రంలో కనీస ఆహార, పానీయ సదుపాయాలు కల్పించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటన జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ దృష్టికి రావడంతో ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. పురుషోత్తం రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ సామగ్రితో వివిధ గ్రామాలకు వెళ్లాల్సిన సిబ్బందికి కనీస భోజన ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో వారు ఖాళీ ప్లేట్లతో రంపచోడవరం లోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేసిన ఘటనను జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బందికి అవసరమైన సంక్షేమ, రవాణా, ఆహార ఏర్పాట్లు సకాలంలో కల్పించడం సంబంధిత అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, పోలింగ్ సిబ్బందికి కనీస సదుపాయాలు కల్పించడంలో వైఫల్యంపై రంపచోడవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పి.వి.వి.ఎస్. ప్రసాద్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తనపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో వివరిస్తూ, నోటీసు అందిన వెంటనే లిఖితపూర్వక వివరణ సమర్పించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.నిర్దేశించిన గడువులోగా వివరణ సమర్పించని పక్షంలో, నిబంధనల ప్రకారం తదుపరి క్రమశిక్షణా చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. పురుషోత్తం రావు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి