పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: చింతూరు మండలం కుయుగూరు గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం వంతెన సమీపంలో నీటిలో చేపట్టిన నిరసన కార్యక్రమంపై చింతూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నొక్వల్ తక్షణమే స్పందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న పీవో గ్రామస్థులతో ఫోన్లో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని పీవో శుభం నొక్వల్ హామీ ఇచ్చారు. సోమవారం తనను కలవాలని, సమస్యను సమగ్రంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పీవోతో ఫోన్లో జరిగిన సంభాషణ అనంతరం గ్రామస్థులు తమ నిరసనను విరమించారు. సుమారు నాలుగు గంటలకు పైగా నీటిలో నిరసన చేపట్టిన నేపథ్యంలో, ఇకపై వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పీవో కోరారు. అస్వస్థతకు గురైన వ్యక్తికి వెంటనే వైద్య సేవలు నిరసన కార్యక్రమంలో ఒక వ్యక్తి అస్వస్థతకు గురైన విషయం పీవో దృష్టికి రావడంతో వెంటనే వైద్య సిబ్బందిని నిరసన ప్రాంతానికి పంపించి ప్రథమ చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బంది పరిశీలన అనంతరం సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్య అధికారులు పీవోకు తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు ప్రస్తుతం జిల్లాలో భారీ వర్షాలు, వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు, సహాయక చర్యలు, వైద్య సేవలు, అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం తదితర అనుబంధ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకునే వరకు ప్రజలు కొంత సహకరించాలని, నీటిలోకి వెళ్లి నిరసనలు చేపట్టకుండా పీవోను సంప్రదించి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐటీడీఏ పీవో శుభం నొక్వల్ కోరారు. కుయుగూరు గ్రామస్థుల సమస్యను సంబంధిత అంశాలతో సమగ్రంగా పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన తదుపరి చర్యలు చేపడతామని పీవో తెలిపారు.
