పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల & జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ కె. దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ప్రజలనుద్దేశించి అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించారు. ఈ వేడుకలకు హాజరైనా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ళ బొజ్జి రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్, చింతూరు సబ్ కలెక్టర్ శుభం నొక్వల్, ఎస్ డి జావళి , వివిధ కార్పొరేషన్ల ఛైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ పెద్దలు, జిల్లా ఉన్నతాధికారులు, పాత్రికేయులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైన వారికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ — ఎన్నో ఏళ్ల ప్రజల ఆకాంక్షల మేరకు రంపచోడవరం, చింతూరు డివిజన్లను కలిపి పోలవరం జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత జరుపుకుంటున్న ఈ తొలి స్వాతంత్ర్య దినోత్సవం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. బ్రిటిష్ దమన పాలనకు వ్యతిరేకంగా మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో గిరిజన యోధులు గాము గంటందొర, గాము మల్లుదొర, అగ్గిరాజు, కంకిపాటి ఎండుపడాలు, గొకిరి ఎర్రేసు, వీరయ్య దొర, మామిడి చిన్నయ్య, గబాలం, సింగడు తదితరులు చేసిన పోరాటాలు దేశ చరిత్రలోనే అజరామరమని కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ‘వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర విజన్@2047’ సాధనకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శాఖల వారీగా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల వివరాలు: వ్యవసాయ & ఉద్యాన శాఖలు: రైతు భరోసా / పీఎం కిసాన్: సూపర్ సిక్స్ హామీ మేరకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సాయంలో భాగంగా, 40,358 మంది రైతులకు రూ.28.16 కోట్లు (రాష్ట్ర వాటా రూ.20.18 కోట్లు, కేంద్ర వాటా రూ.7.99 కోట్లు) జమ చేయడం జరిగింది. రైతు సేవా కేంద్రాలు: 122 ఆర్.ఎస్.కేల ద్వారా 5,564 మంది రైతులకు 20,074 యూరియా బస్తాలు, 1,989 డీఏపీ బస్తాలు పంపిణీ చేశారు. ఖరీఫ్‌లో 30,288 మంది రైతులకు 10,853 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులోకి తెచ్చారు. ఉద్యాన విస్తరణ: 1,255 ఎకరాల్లో జీడిమామిడి, 151 ఎకరాల్లో సీతాఫలం, 549 ఎకరాల్లో రబ్బరు, రెండేళ్లలో 1,150 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపట్టారు. 300 మంది రైతులకు 90% రాయితీతో పవర్ స్ప్రేయర్లు అందించారు. పశుసంవర్ధక, పట్టు & మత్స్య శాఖలు: డైరీ డెవలప్‌మెంట్: 180 మంది గిరిజన రైతులకు 360 పాడి పశువులు పంపిణీ చేయగా, 18 డెయిరీ షెడ్ల నిర్మాణం పూర్తయింది. పట్టు పరిశ్రమ: 506 ఎకరాల్లో మల్బరీ సాగు ద్వారా 70,648 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్ల ఉత్పత్తి సాధించారు. సిల్క్ సమగ్ర పథకం కింద 90% సబ్సిడీతో రూ.5.04 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. మత్స్య శాఖ: 2026-27 లక్ష్యంగా 1.18 కోట్ల ఐఎంసీ ఫింగర్లింగ్స్ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నారు. గోదావరి మత్స్యకారులకు 150 ఫిషింగ్ లైసెన్సులు జారీ చేసి 100% లక్ష్యాన్ని సాధించారు. విద్య, వైద్యం & గిరిజన సంక్షేమం: వైద్య రంగం: అత్యవసర సేవలకు 20 అంబులెన్సులు, 12 ‘108’ వాహనాలు, 102 ‘104’ మొబైల్ క్లినిక్‌లు, 10 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు, 27 ఫీడర్ అంబులెన్సులు నిరంతరం సేవలందిస్తున్నాయి. రంపచోడవరంలో బ్లడ్ డిజార్డర్స్ డే కేర్ సెంటర్, పీఎం-జన్మన్ కింద 12 మొబైల్ మెడికల్ యూనిట్లు మంజూరయ్యాయి. విద్యా రంగం: మెగా డీఎస్సీ-2025 ద్వారా 382 మంది ఉపాధ్యాయుల నియామకం జరిగింది. ‘తల్లికి వందనం’ కింద 53,474 మంది లబ్ధిదారులకు రూ.69.52 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ ద్వారా 819 పాఠశాలల్లో 30,402 మంది విద్యార్థులకు భోజనం అందుతోంది.ఐసీడీఎస్ & ఆర్.ఓ.ఎఫ్.ఆర్: 24,587 మంది గిరిజన రైతులకు 82,646 ఎకరాలకు అటవీ హక్కు పత్రాలు అందించారు. ‘బాల సంజీవిని’ ద్వారా వేలాది మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. తాగునీరు, గృహనిర్మాణం & విద్యుత్ రంగం: తాగునీటి సౌకర్యం: జిల్లాలో 68,434 కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కల్పించగా, మిగిలిన వారి కోసం 184 పనులు పురోగతిలో, 588 పనులు టెండర్ దశలో ఉన్నాయి. గృహనిర్మాణం: పీఎంఏవై-గ్రామీణ్ కింద 1,327 ఇళ్లు, పీఎం-జన్మన్ కింద 2,257 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పీఎంఏవై 2.0 కింద 17,944 మందిని నమోదు చేశారు. విద్యుత్: పీఎం-జన్మన్ & పీఎంజేయూజీఏ కింద 7,900 పైచిలుకు గృహాలకు విద్యుద్దీకరణ పూర్తి చేశారు. జగజీవన్ జ్యోతి కింద 59,594 మంది ఎస్సీ/ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి రూ.4.93 కోట్ల లబ్ధి చేకూర్చారు. మౌలిక వసతులు & రహదారులు : పంచాయతీ రాజ్ & ఆర్ అండ్ బి: ఏఐఐబీ కింద రూ.70.65 కోట్లతో 40 పనులు, పీఎం-జన్మన్ కింద రూ.137.90 కోట్లతో 52 రహదారులు, ఆర్‌సీపీఎల్ డబ్ల్యూఈఏ కింద రూ.54.30 కోట్లతో రహదారులు, బ్రిడ్జి పనులను వేగవంతం చేశారు. ఉపాధి హామీ పథకం: 31.57 లక్షల పనిదినాలు కల్పించి, వేతనాల రూపంలో రూ.89.53 కోట్లు, మెటీరియల్ రూపంలో రూ.18.13 కోట్లు వెచ్చించారు. మహిళా సాధికారత & జీవనోపాధి: ఎన్టీఆర్ భరోసా: 46,624 మంది పింఛనుదారులకు నెలకు రూ.19.56 కోట్ల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాలు: ఎస్.హెచ్.జి బ్యాంకు లింకేజీ కింద రూ.60.15 కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ.28.01 కోట్ల రుణాలు మంజూరు చేశారు. అరణ్య శ్రీ & వెదురు పరిశ్రమ: 10,000 మంది గిరిజన మహిళల భాగస్వామ్యంతో 6 లక్షల వెదురు మొక్కల సాగు చేపట్టి, మారేడుమిల్లి మండలం దేవరపల్లి వద్ద ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు రూ.11.28 లక్షల నికర ఆదాయం సమకూరింది. వన్ ధన్ వికాస్ కేంద్రాలు : 174 కేంద్రాల ఏర్పాటుతో పాటు రంపచోడవరంలో రూ.81 లక్షలతో 14 జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పారు. 7. పోలవరం R&R పునరావాసం: చింతూరు డివిజన్: ఫేజ్-1ఏ కింద 6 కాలనీల్లో 1,162 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 2,260 కుటుంబాలకు రూ.161.43 కోట్లు చెల్లించారు.రంపచోడవరం డివిజన్: 20 కాలనీల్లో 3,537 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 5,564 కుటుంబాలకు రూ.339.45 కోట్లు ఆర్ అండ్ ఆర్ పరిహారం పంపిణీ చేశారు. 539 మంది నిర్వాసితులకు 1,102 ఎకరాల భూమి కేటాయించారు. ఎక్సైజ్ & స్వర్ణాంధ్ర విజన్ (P4) – ప్రొహిబిషన్ & ఎక్సైజ్: 2025–26 సంవత్సరంలో శాఖ ద్వారా రూ.148 కోట్ల ఆదాయం సమకూరింది. అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు. పీ4 (P4 – జీరో పావర్టీ): జిల్లాలో గుర్తించిన 40,303 పేద కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు 2,910 మంది మార్గదర్శులను అనుసంధానించారు. చివరిగా, విధి నిర్వహణలో విశిష్ట సేవలు కనబరిచిన అధికారులు, సిబ్బంది, పోలీసు బలగాలు, పీ4 మార్గదర్శకులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కుల పరిరక్షణకు, పెసా చట్టం అమలుకు జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ జిల్లా ప్రజలందరికీ మరోమారు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
