
అనకాపల్లి: జిల్లాలో జరుగుతున్న భూసేకరణ సమస్యలు పై ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్,మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ గారిని రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) నాయకత్వంలో కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది.ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం ఆర్ శివరాంపురం, ఆర్.భీమవరం, మల్లాం,లూలూరు,నిమ్మలోవ పంచాయతీల్లో 10 గ్రామాల్లో ఏపీఐఐసీ పరిశ్రమల ఏర్పాటు పేరుతో 2,525 ఎకరాల భూములను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు పేరుతో వందలాది ఎకరాలను కార్పొరేట్ల కోసం కారుచౌకగా కట్టపెట్టేందుకు బలవంతపు భూసేకరణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.ఈ ప్రజావ్యతిరేక విధానాల వలన పేద రైతులు, రైతు కూలీలు జీవనోపాధిని కోల్పోతారు. అందుకనే ప్రజలంతా భూసేకరణ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.కానీ ప్రభుత్వం మాత్రం కనీసంగా భూసేకరణ చట్టం -2013 ప్రకారం కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా,భూసేకరణ కోసం బలవంతంగా ఎంజాయ్మెంట్ సర్వేలను చేస్తున్నారని, ప్రభుత్వం భూ సేకరణ చేపడుతున్న డి-పట్టా, బంజరు భూములను పేదలు,రైతు కూలీలు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్,రెవెన్యూ అధికారులు మాత్రం ప్రజలకు ఎటువంటి హక్కులు లేవన్నట్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, భూసేకరణ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలంతా తమ భూములను పరిశ్రమల కోసం భూసేకరణ చేయరాదని ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తూ పోరాడుతున్నారని విజ్ఞాపన పత్రంలో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రైతుకూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ, అనకాపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆడారి అప్పారావు,కోన మోహన్ రావు, ఉపాధ్యక్షులు పైలి రమేష్,రైతు కూలీ సంఘం సభ్యులు ఎల్ శ్రీనివాసరావు,ఆర్.భీమవరం, మల్లాం గ్రామాల ప్రజలు మువ్వల అప్పలనాయుడు,బోర అప్పలనాయుడు,ఎమ్ శ్రీనివాసరావు,కర్రి పాపారావు,సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.