
పెట్టుబడి పేరుతో తీసుకున్న రూ.22 లక్షలు తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నర్సీపట్నంకు చెందిన జనసేన నాయకుడు ఎన్ఎస్ జీ.దొరబాబుపై బేరా కామాక్షి కల్పన అనే మహిళ శనివారం నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుదారు కామాక్షి కల్పన తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త బేరా శేషు 2011లో వివేకానంద జూనియర్, డిగ్రీ కళాశాలలో భాగస్వామిగా మొదట రూ.12 లక్షలు, అనంతరం మరో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారని, మొత్తం రూ.22 లక్షలు పెట్టుబడి అయినప్పటికీ భర్త మరణానంతరం ఇప్పటివరకు ఆ డబ్బులు తమ కుటుంబానికి తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు.
డబ్బులు కోరిన ప్రతిసారి దొరబాబు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ, అవమానకరంగా మాట్లాడటంతో పాటు మళ్లీ డబ్బులు అడిగితే చంపేస్తాం.. ఎక్కడికైనా వెళ్లి చెప్పుకో.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ బెదిరింపుల వల్ల తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఓ రోజు రాత్రి సమయంలో తనను బైక్‌తో ఢీకొట్టేందుకు ప్రయత్నించారని, అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు. ఈ ఘటన తర్వాత తమ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందన్నారు.
దొరబాబు ప్రస్తుతం జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ, చట్టం అందరికీ సమానమనే నమ్మకంతో ఫిర్యాదు చేస్తున్నానని కామాక్షి కల్పన పేర్కొన్నారు. తనపై బెదిరింపులు, దాడి యత్నానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, తనకు రావలసిన పెట్టుబడి మొత్తాన్ని ఇప్పించి, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని డీఎస్పీని కోరారు.