
పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎస్‌సీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో పలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులం సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు జి. గౌరీ శంకరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇస్రాయెల్‌లో హోమ్ బేస్డ్ కేర్ గివర్‌గా ఉద్యోగాలు పొందేందుకు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి జిడిఏ , ఏఎన్ఎం , జి ఎన్ ఎం, బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు సి ఈ ఎఫ్ ఆర్–బి2 స్థాయి ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఇస్రాయెల్‌లో ఉద్యోగం పొందే అవకాశం ఉండగా, నెలకు సుమారు రూ.1.99 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉత్తీర్ణులై, ఆయా కోర్సులకు అవసరమైన అర్హతలు, అనుభవం కలిగిన ఎస్‌సీ యువత కోసం కిసాన్ డ్రోన్ ఆపరేటర్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్, సోలార్ పీవీ ఇన్‌స్టాలర్ (సూర్యమిత్ర), ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటెనెన్స్, బ్యూటీ థెరపిస్ట్, ప్లంబర్ (జనరల్) తదితర కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ మండల లేదా మున్సిపల్ కార్యాలయాలతో పాటు కాకినాడ లోని ఎస్‌సీ కార్పొరేషన్ కార్యాలయంలో 93989 07208, 98855 82325 నంబర్లకు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవ చ్చన్నారు. దరఖాస్తులను సంబంధిత వెబ్ లింకుల ద్వారా లేదా మండల, మున్సిపల్ కార్యాలయాల్లో పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, రేషన్ కార్డు ప్రతులను జతచేసి మూడు రోజుల్లోగా స్వయంగా లేదా edapsccfcegd@gmail.com ఇ-మెయిల్‌కు పంపించాలని సూచించారు.