జగ్గంపేట, జూలై 13: ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 31న కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న స్కీం వర్కర్ల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడీ సంఘం జిల్లా కార్యదర్శి ఈ. చంద్రావతి పిలుపునిచ్చారు. జగ్గంపేటలోని నెహ్రూ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఎం. శ్యామల అధ్యక్షతన సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రావతి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న కలెక్టరేట్ ధర్నాలో జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో సంఘం కోశాధికారి వై.వి. రాజేశ్వరి, కమిటీ సభ్యులు లక్ష్మి, కృపాభాయ్, వెంకటలక్ష్మి, జ్యోతి, నాగదుర్గ, రామలీల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
