జగ్గంపేట, జూలై 14: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం భీమవరం, కిర్లంపూడిలో పర్యటించనున్నారు. ముందుగా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమై ఫీడ్ ధరల పెరుగుదల, గిట్టుబాటు ధరలు లేకపోవడం, పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై రైతులతో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు భీమవరం నుంచి హెలికాప్టర్‌లో జగ్గంపేటకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి బయలుదేరనున్నారు. కిర్లంపూడిలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కార్యక్రమం అనంతరం కిర్లంపూడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇదిలా ఉండగా, ముద్రగడ పద్మనాభం మృతిపై కిర్లంపూడి మండలం పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. పలుచోట్ల వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కిర్లంపూడికి చేరుకుని ముద్రగడకు తుది నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికంగా భారీగా అభిమానులు, కాపు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
