కిర్లంపూడి, జూలై 20: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి, దివంగత నేత స్వర్గీయ ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అగ్రనేతలు సోమవారం పరామర్శించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు కిర్లంపూడికి చేరుకుని ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, తోట నరసింహం, కురసాల కన్నబాబు, సాకే శైలజనాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, మాజీ ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తెల్లం బాలరాజు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావుతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం ముద్రగడ పద్మనాభం సతీమణి పద్మావతి, కుమారులు బాలు, గిరిలను పరామర్శించిన నేతలు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం ప్రజా సేవలు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని నేతలు స్మరించుకున్నారు.
