తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ২:৫০ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ২৯, ২০২৬, ৩:৪৭ পি.এম
BREAKING NEWS

చిల్లంగిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కిర్లంపూడి, జూలై 29: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం గ్రామ టీడీపీ నాయకులు కాళ్ళ వెంకటేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు.
ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.4,000 పెన్షన్‌ను వారి ఇళ్ల వద్దకే అందజేస్తున్నామని చెప్పారు. "తల్లికి వందనం" పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం, "దీపం-2" పథకం కింద మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు వివరించారు. అలాగే అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించి రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం, రుణమాఫీ, రైతు భరోసా కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరలు, ఉచిత బోరు బీమా, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంతో పాటు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సిమెంట్ రోడ్లు, తాగునీటి పైప్‌లైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చిల్లంగి గ్రామ అభివృద్ధికి నిధుల కొరత రానీయబోమని, గ్రామ ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడపా భరత్, కన్నబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, తోట రవి, జనపరెడ్డి సుబ్బారావు, భూపాలపట్నం ప్రసాద్, చదరం చంటిబాబు, తూము కుమార్, కుర్ల చినబాబు, గుడాల రాంబాబు, బోదిరెడ్ల సుబ్బారావు, గండే కాశీ, కంచుమర్తి రాఘవ, గౌతు చిన్న, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.