కాకినాడ జిల్లా, జగ్గంపేట, ఆగస్టు 5:
జగ్గంపేట మండలం భావారం సమీపంలోని ఏలేరు రిజర్వాయర్‌లో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ చూసి స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడు తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన వడ్డీ ప్రశాంత్ కుమార్ (18)గా గుర్తించారు. అతడు సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి ఏలేరు రిజర్వాయర్‌కు వెళ్లిన సమయంలో రిజర్వాయర్‌లోని లోతైన గోతిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న జగ్గంపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రశాంత్ కుమార్ కుటుంబ పరిస్థితి మరింత విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే తండ్రిని కోల్పోయిన అతని తల్లి ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉండగా, ఏకైక కుమారుడి మృతి కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ కారణంగా భావారం ప్రాంతంలోని ఏలేరు రిజర్వాయర్‌కు సందర్శకుల రద్దీ పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర జలాశయాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగిన భద్రతా చర్యలు తీసుకుని అధికారుల పర్యవేక్షణ పెంచాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

