జగ్గంపేట, ఆగస్టు 7: ప్రభుత్వం గతంలో నిర్మించి హాస్టల్ నిర్వహిస్తున్న ప్రస్తుత స్థలంలోనే నూతన హాస్టల్ భవనాన్ని నిర్మించాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. జగ్గంపేటలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలుర హాస్టల్‌ను 1982లో స్థాపించి, 1984లో ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం హాస్టల్‌కు 42 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శిథిలావస్థకు చేరిన హాస్టల్‌ను ఖాళీ చేయించి రెండేళ్లు గడుస్తున్నా నూతన భవన నిర్మాణం చేపట్టలేదని ఆరోపించారు. మూడు హాస్టళ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌గా నిర్మిస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, అయితే హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. జగ్గంపేట ప్రధాన కేంద్రంలో ఉన్న హాస్టల్ స్థలాన్ని మార్చి, పట్టణానికి దూరంగా చెరువు ప్రాంతంలో హాస్టల్ నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న స్థలాన్ని ఇతర అవసరాలకు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ విషయంపై సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి జగ్గంపేటలోని శిథిలావస్థకు చేరిన హాస్టల్ స్థలంతో పాటు హైస్కూల్ వెనుక ఉన్న స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. ప్రధాన రహదారిపై ఉన్న హాస్టల్ స్థలాన్ని రాజకీయ నాయకులకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.ఈ అంశంపై జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తంతాటి కిరణ్ కుమార్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పృథ్వీరాజ్ తెలిపారు. హాస్టల్ నిర్మాణ స్థలాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయించి, 42 సంవత్సరాలుగా హాస్టల్ కొనసాగుతున్న ప్రస్తుత స్థలంలోనే నిర్మాణం చేపట్టేలా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ స్పష్టం చేసినట్లు తెలిపారు. అవసరమైతే కోర్టు ద్వారా స్టే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నట్లు మర్రి పృథ్వీరాజ్ తెలిపారు.
