తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৩:৫১ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ৮, ২০২৬, ১:০৬ এ.এম
BREAKING NEWS

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బీబీపట్నం జడ్పీహెచ్ హై స్కూల్.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బీబీపట్నం జడ్పీహెచ్ హై స్కూల్.

గ్రామ నాయకులు, తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులకు దినచర్య పుస్తకాలు, గుర్తింపు కార్డులు

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తులు, తల్లిదండ్రులు, పాఠశాల శ్రేయోభిలాషులు అందిస్తున్న సహకారం అభినందనీయమని జడ్పీహెచ్‌ఎస్‌ బీబీ పట్నం పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖరరావు తెలిపారు.అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బెన్న భూపాలపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు దినచర్య పుస్తకాలు, గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల గ్రామ నాయకులు, తల్లిదండ్రులు అందించిన విరాళాలతో ఏర్పాటు చేసిన పాఠశాల అభివృద్ధి నిధి నుంచి విద్యార్థులందరికీ దినచర్య పుస్తకాలను పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల చేతుల మీదుగా అందజేశారు.అదేవిధంగా పాఠశాల శ్రేయోభిలాషి గొంది సిద్దు అందించిన ఆర్థిక సహాయంతో పాఠశాలలోని 220 మంది విద్యార్థులకు విద్యార్థి గుర్తింపు కార్డులను ఆయన చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జనసేన యువ నాయకుడు మాట్లాడుతూ.. బీబీపట్నం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రికార్డు స్థాయిలో మార్కులు సాధించి, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు చదువులో ఏ సహాయం అవసరమైనా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధిస్తే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అందిస్తానని ప్రకటించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు గ్రామ నాయకులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు ముందుకు రావడం పాఠశాల అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో సమాజ భాగస్వామ్యం కీలకమని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖరరావు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సత్తిబాబు, పెద్దాడ నాగేష్, రామకృష్ణ, రాజు నాయుడు, ఈశ్వరరావు, అప్పన్న, కిషోర్, పెనుకొండ సోమరాజుతో పాటు పలువురు గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.