
పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ( పి జి ఆర్ ఎస్) ద్వారా ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీని అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విచారించి నాణ్యమైన పరిష్కారం చూపాలని పొలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పి జి ఆర్ ఎస్ వారాంతపు సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, ఓఎస్డీ (పోలీస్) జావాళి, ఆర్డీవో శ్రీమతి కె. స్వాతి మరియు జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ శాఖల ఫిర్యాదుల పరిష్కార తీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన “సూపర్ ఆడిట్” మరియు “మీకోసం” కాల్ సెంటర్ ఫీడ్‌బ్యాక్ పరిశీలనలో అనేక శాఖల్లో అర్జీల పరిష్కారంపై తీవ్ర లోపాలు బయటపడ్డాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన పరిష్కారమే అసలైన కొలమానం పోర్టల్‌లో అర్జీలను కేవలం సంఖ్యల కోసం క్లోజ్ చేయకుండా, బాధితుడికి నిజమైన ప్రయోజనం చేకూరే వరకు పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారుల పనితీరును “ఫిర్యాదుల ముగింపు శాతం”తో కాకుండా ప్రజల సంతృప్తి ప్రాతిపదికన మాత్రమే అంచనా వేస్తామని తెలిపారు.

క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరి రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులతో మాట్లాడకుండా, సరైన విచారణ చేయకుండా అర్జీలను తోసిపుచ్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. బలహీన వర్గాల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు, వృద్ధులు, మహిళలు మరియు నిరక్షరాస్యుల నుండి వచ్చే ఫిర్యాదులపై అధికారులు మరింత మానవీయ దృక్పథంతో స్పందించి తగిన న్యాయం చేయాలని దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి శాఖలో నమోదవుతున్న రెవెన్యూ, రీ-సర్వే, తాగునీరు, పంచాయతీ సమస్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. జిల్లా అధికారులు తమ క్షేత్రస్థాయి సిబ్బందితో తరచూ సమీక్షలు నిర్వహించి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.