పోలవరం జిల్లావాణీ ప్రతినిథి:పి.4 మండలాల వారీగా బంగారు కుటుంబాల సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు శుక్రవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో పి-4 ( పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్) కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రంపచోడవరంలోని కలెక్టర్ ఛాంబర్ నుంచి పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పి-4 కార్యక్రమం కింద చేపడుతున్న కార్యక్రమాలు, బంగారు కుటుంబాల గుర్తింపు, మార్గదర్శుల అనుసంధానం, కుటుంబాల అవసరాల మేరకు అందిస్తున్న సహాయ సహకారాలు, సాధికారత కోసం చేపడుతున్న చర్యలపై జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ముఖ్యమంత్రికి సమగ్ర వివరాలను తెలియజేశారు. పి-4 కార్యక్రమం ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర విజన్ –2047లో భాగంగా పేదరిక నిర్మూలనకు పి-4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు ముందుకు వచ్చి ఆర్థికంగా వెనుకబడిన బంగారు కుటుంబాలకు మార్గదర్శకత్వం, సహాయం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆయా కుటుంబాలను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడం పి-4 ప్రధాన లక్ష్యం గా కార్యాచరణ సిద్ధం చేయడం జరుగుతోంది అని తెలిపారు.రంపచోడవరం నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి, రంపచోడవరం నియోజక వర్గంలోని 12 మండలాల్లో పి-4 కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. మండలాల వారీగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి, వారి కుటుంబ పరిస్థితులు, జీవనోపాధి, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన సహాయాన్ని అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికి ఒకే తరహా సహాయం కాకుండా, ఆ కుటుంబానికి అవసరమైన సహాయాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా మార్గదర్శకత్వం అందించడం పి-4 కార్యక్రమంలో ప్రధాన అంశమని కలెక్టర్ పేర్కొన్నారు. జీవనోపాధికి ప్రాధాన్యం, బంగారు కుటుంబాలకు వ్యవసాయ ఆధారిత జీవనోపాధి, పశుపోషణ, చిన్నతరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు వంటి అంశాల్లో అవసరమైన సహకారం అందించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధికారిక పి-4 వేదికలో వ్యవసాయం–జీవనోపాధి, వ్యాపార ప్రారంభం, ఆరోగ్య సహాయం వంటి విభాగాలను కుటుంబాల అవసరాలకు అనుగుణంగా మద్దతు అందించే మార్గాలుగా గుర్తించి అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై దృష్టి, బంగారు కుటుంబాల్లోని పిల్లలకు విద్యా అవకాశాలు, కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, స్వచ్ఛమైన ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ వంటి ప్రాథమిక అవసరాలు అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. పి-4లో ప్రతి కుటుంబం ఆర్థికంగా మాత్రమే కాకుండా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మండలాల వారీగా క్షేత్రస్థాయి పర్యవేక్షణ, రంపచోడవరం నియోజక వర్గ పరిధిలోని మండలాల్లో పి-4 కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంపికైన కుటుంబాలకు అందుతున్న సహాయం, వాటి ద్వారా జరుగుతున్న మార్పు, కుటుంబాల ఆదాయ స్థాయి పెరుగుదల తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన, పి-4 కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రభుత్వం – ప్రైవేట్ రంగం – ప్రజలు కలిసి పనిచేసే భాగస్వామ్య కార్యక్రమమని కలెక్టర్ తెలిపారు. ఆర్థికంగా ఎదిగిన వారు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రవాస భారతీయులు, వివిధ సంస్థలు, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పి-4 కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతి అర్హ కుటుంబానికి పథకాల ప్రయోజనాలు, అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు.పేదరికం లేని సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రంపచోడవరం నియోజకవర్గంలో పి-4 కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, సామాజిక సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. మార్గదర్శి కుటుంబాల దత్తతలో 94.70 శాతం ప్రగతి, జిల్లాలో మార్గదర్శి కుటుంబాల దత్తత కార్యక్రమంలో భాగంగా మొత్తం 40,303 బంగారు కుటుంబాలు (BKS) ఉండగా, వాటిలో 38,169 కుటుంబాలను దత్తత తీసుకోవడం పూర్తయి 94.70 శాతం ప్రగతి సాధించినట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ వివరించారు. మండలాల వారీగా పరిశీలిస్తే అడ్డతీగలలో 4,288 కుటుంబాలు (97.12 శాతం), చింతూరులో 6,458 కుటుంబాలు (99.98 శాతం), దేవీపట్నంలో 2,244 కుటుంబాలు (100 శాతం), గంగవరం ఏజెన్సీలో 1,815 కుటుంబాలు (90.29 శాతం), కూనవరంలో 2,717 కుటుంబాలు (99.66 శాతం), మారేడుమిల్లిలో 3,323 కుటుంబాలు (100 శాతం), నెల్లిపాకలో 3,177 కుటుంబాలు (83.21 శాతం), రాజవొమ్మంగిలో 4,150 కుటుంబాలు (98.66 శాతం), రంపచోడవరంలో 3,459 కుటుంబాలు (87.76 శాతం), వరా రామచంద్రాపురంలో 2,346 కుటుంబాలు (82.34 శాతం), వై.రామవరం మండలంలో 4,192 కుటుంబాలు (97.21 శాతం) దత్తత ప్రక్రియ పూర్తయింది. మొత్తం 40,303 బంగారు కుటుంబాలకు సంబంధించి 2,915 కుటుంబాల ధృవీకరణ GSWS ద్వారా పెండింగ్‌లో ఉండగా, 39,670 కుటుంబాలను GSWS ద్వారా ధృవీకరించినట్లు పేర్కొన్నారు. మెరుగైన జీవన విధానం కోసం 633 కొత్త అవసరాలు నమోదు చేయడం జరిగిందన్నారు. 19,797 మార్గదర్శి కుటుంబాలను జి ఎస్ డబ్ల్యూ ఎస్ సంప్రదించగా, వారి 1,003 కుటుంబాలకు కొత్త అవసరాలు గుర్తించబడ్డాయన్నారు. మండలాల వారీగా దత్తత శాతాన్ని మరింత పెంచి, మిగిలిన కుటుంబాలను కూడా త్వరితగతిన దత్తత తీసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సి పి ఓ వెంకట్రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.