
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టడం జరిగిందనీ పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం రంపచోడవరం మండలంలోని పెద్ద గెద్దాడ

గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు,వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులతో జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి,సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మొదటి తేదీనే ఇంటి వద్దకే పింఛన్ అందించే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పింఛన్ పంపిణీలో ఎలాంటి జాప్యం లేదా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు,సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

పింఛన్ లబ్ధిదారులు ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని జే సి తెలిపారు. ప్రతినెల రేషన్ సకాలంలో అందుతున్నది లేనిది ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా పింఛన్ డబ్బులకు లంచాలు అడుగుతున్నది లేనిది ఆయన ఆరా తీశారు. ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వవద్దని మీ వ్యక్తిగత ఖర్చులకు మీ కుటుంబ పోషణ అవసరాల కొరకు ఉపయోగించు కోవాలని ఆయన అన్నారు. జాయింట్ కలెక్టర్ వారి వెంట డిప్యూటీ ఎంపీడీవో హరిబాబు, ఏపిఎం పీ. మధు బాబు, వీఆర్వో యోసోబు తదితరులు పాల్గొన్నారు.