తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ৪:০৩ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ১৯, ২০২৬, ৭:১১ এ.এম
BREAKING NEWS

పారిశుధ్య కోరల్లో గుర్రంపాలెం: పట్టించుకోని అధికారులు, రోగాల బారిన ప్రజలు

జగ్గంపేట (గుర్రంపాలెం): జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో పారిశుధ్యం పడగవిప్పింది. వీధుల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన మురుగు నీరు, పేరుకుపోయిన చెత్తాచెదారంతో గ్రామం నరకాన్ని తలపిస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, కనీసం మురుగు నీరు పోయే మార్గం కూడా చూపడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.​మురుగు నీటితో ముంచుకొస్తున్న ముప్పు ​గ్రామంలోని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. నీరు నిల్వ ఉండిపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల గ్రామంలో డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కనీసం వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని, గతంలో పలుమార్లు విన్నవించినా పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజలకు రక్షిత మంచినీరు అందించాల్సిన వాటర్ ట్యాంకు సమీపంలోనే మురుగు నీరు నిలిచి ఉండటం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. ​"నీరు పోయేలా మార్గాలు చూపించండి మహాప్రభో" అని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, గుర్రంపాలెంలో పారిశుధ్య పనులు చేపట్టి, వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.