కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 27: కాకినాడ జిల్లా జగ్గంపేటలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. జగ్గంపేటలో ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పవిత్ర గ్రంథోత్సవ వేడుక ఆదివారం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒమ్మి రఘురాంకు ముస్లిం పెద్దలు, యువత సాదర స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సమాజంలో సర్వమతాల ప్రజలు సుఖశాంతులతో, అన్యోన్యతతో, ఐక్యతతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు తమపై చూపిన అపారమైన ఆప్యాయతకు, అందించిన ఆతిథ్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఒమ్మి రఘురాం మాట్లాడుతూ.. “కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలి. జగ్గంపేటలో వెల్లివిరుస్తున్న మత సామరస్యం, సోదరభావం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

