HomeUncategorizedమేయర్ అభ్యర్థి భవానీతో పాటు 66 డివిజన్ల అభ్యర్థులను గెలిపించండి_ వైసీపీ హయాంలో కాకినాడ అభివృద్ధి...

మేయర్ అభ్యర్థి భవానీతో పాటు 66 డివిజన్ల అభ్యర్థులను గెలిపించండి_ వైసీపీ హయాంలో కాకినాడ అభివృద్ధి కుంటుపడింది_ డ్రగ్స్, గంజాయి వ్యాపారులకు వైసీపీ కార్పొరేట్ టికెట్లు


కాకినాడ, జిల్లావాణి, నవంబరు 24: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి ఆకుల భవానీతో పాటు 66 మంది కూటమి డివిజన్ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కోరారు.మంగళవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పాలనలో కాకినాడ నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నగరానికి చేసిన అభివృద్ధి ఏమిటో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.స్మార్ట్‌సిటీ నిధులతో అచ్చంపేట నుంచి జగన్నాథపురం వరకు రహదారుల నిర్మాణంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, మురికివాడల్లో అభివృద్ధి పనులు తమ హయాంలోనే చేపట్టామన్నారు. నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవనాన్ని కూడా వైసీపీ పాలకులు పూర్తి చేయలేకపోయారని, తాము అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. ఏలేశ్వరం నుంచి 228 కోట్లతో మంచినీటిని తీసుకొచ్చి కాకినాడ ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.తమ హయాంలో బీచ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించామని, ఆ తర్వాత పర్యాటక అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం తిరిగి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, నగరంలో ఫుడ్‌ హబ్‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. కాకినాడ అభివృద్ధికి ద్వారంపూడి అడ్డుపడ్డారని, మూడో వంతెన నిర్మాణాన్ని కూడా అడ్డుకున్నారని కొండబాబు ఆరోపించారు. తమ భూములకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే మూడో వంతెన పనులను నిలిపివేయించారని విమర్శించారు. ఐదేళ్లలో కనీసం అర కిలోమీటరు రహదారి కూడా నిర్మించలేని వ్యక్తి ద్వారంపూడి అని వ్యాఖ్యానించారు.
నగరంలో గంజాయి, డ్రగ్స్‌ వ్యాపారాలకు ద్వారంపూడి అనుచరులు పాల్పడ్డారని, చెత్త తరలించే వాహనాల్లో సైతం గంజాయి రవాణా చేసినట్లు ఆరోపించారు. గంజాయి వ్యాపారులతో సంబంధాలున్న వారికే వైసీపీ తరఫున కార్పొరేటర్‌ టికెట్లు ఇచ్చారని విమర్శించారు. వైసీపీకి మేయర్‌ అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాదా సత్యశ్రీ తనకున్న మంచి పేరును చెడగొట్టుకోవద్దని, వైసీపీ తరఫున పోటీ చేయవద్దని కొండబాబు సూచించారు. నగర సమగ్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కాకినాడ ప్రజలకు వనమాడి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments