పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌లో ఏటపాక మండలం గోమ్ముకొత్తగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో చేపల వేట సందర్భంగా విషాద ఘటన – తక్షణ సహాయక చర్యలు చేపట్టి మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం అని స్థానిక జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. చింతూరు డివిజన్ పరిధిలోని ఏటపాక మండలం గోమ్ముకొత్తగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన గిరిజనులు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగి ఐదుగురు మృతిచెందిన విషాద ఘటనపై కలెక్టర్ దినేష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులను సంఘటనా స్థలానికి పంపించి సహాయక చర్యలను అత్యవసర ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గోమ్ముకొత్త గూడెం గ్రామానికి చెందిన మొత్తం 10 మంది గిరిజనులు జీవనోపాధిలో భాగంగా గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లారు. వారు చేపల వేట సౌలభ్యం కోసం రెండు బృందాలుగా విడిపోయి చేపల వేట కొనసాగిస్తుండగా, ఒక బృందానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతిచెందడం అత్యంత బాధాకరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మరో బృందంలోని ఐదుగురు సభ్యులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం అందినట్లు తెలిపారు. మృతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ఊకె సుశీల, భర్త రాంబాబు, 37, ఊకె లక్ష్మి, భర్త వెంకటేష్, 37,. తూర్రం భారతి, భర్త శ్రీను, 40, .బి. బాలరాజు, తండ్రి ముత్తయ్య, 40 ,యు. రమేష్, తండ్రి వీరయ్య, 37, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖలు, స్థానిక అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు మరియు స్థానిక మత్స్యకారుల సహకారంతో సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గోదావరి నదిలో విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన ఉపశమన చర్యలు వేగంగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే పంపిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే గోమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన మిగిలిన ఐదుగురు గిరిజనులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై రెవెన్యూ మరియు పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గోదావరి నదిలో వర్షాకాలం కారణంగా నీటి మట్టం పెరగడంతో పాటు ప్రవాహం వేగంగా ఉన్నందున గిరిజనులు, మత్స్యకారులు మరియు నదిపై ఆధారపడి జీవించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లే సమయంలో భద్రతా జాగ్రత్తలు పాటించాలని, నది ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన ఉపశమన చర్యలు వేగంగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అదేవిధంగా, మృతిచెందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.25,000 చొప్పున జిల్లా యంత్రాంగం ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే పంపిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గిరిజనులకు జిల్లా యంత్రాంగం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని, పోలవరం జిల్లా కలెక్టర్ శ్రీ కె. దినేష్ కుమార్ తెలిపారు.
