గండేపల్లి, మార్చి 17 (జిల్లా వాణి ప్రతినిధి): కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మంగళవారం పెద్దాపురం ఇన్‌చార్జి సబ్ డివిజనల్ పోలీస్ కె.వి. సత్యనారాయణ పర్యవేక్షణలో గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గండేపల్లి ఎస్‌ఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి, వారి వద్ద ఉండాల్సిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి, మరియు ఇన్సూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణరక్షణ కవచమని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు తప్పవని హెచ్చరిస్తూనే, నిబంధనల వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. మితిమీరిన వేగంతో వెళ్లవద్దని, మద్యం సేవించి వాహనం నడపడం నేరమని స్పష్టం చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ మాట్లాడటం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు.ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై స్పష్టమైన అవగాహన పెంపొందించడం ద్వారా రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

