జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి)నేర నియంత్రణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘జిల్లా క్రైమ్ సమీక్షా సమావేశం’లో భాగంగా, జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావు, ఎస్ఐ టి. రఘునాథరావులకు ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇటీవల జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామంలో 80 ఏళ్ల వృద్ధుడు గెడ్డం కన్నయ్య గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రాథమిక దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. పోలీసుల చాకచక్యం ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జగ్గంపేట సీఐ, ఎస్ఐలు ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఎటువంటి క్లూ లేని ఈ ఉదంతంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technical Intelligence) సమర్థవంతంగా వినియోగించి, నిందితులను గుర్తించారు. అతి తక్కువ సమయంలోనే ముద్దాయిలను అదుపులోకి తీసుకుని, వారిని కోర్టులో హాజరుపరిచారు.”సాంకేతికతను వాడుకుంటూ, అంకితభావంతో పనిచేస్తే ఎంతటి క్లిష్టమైన కేసులనైనా ఛేదించవచ్చని జగ్గంపేట పోలీసులు నిరూపించారు.”ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు పాల్గొని ప్రతిభ చాటిన సిబ్బందిని అభినందించారు.

