విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదల నాగబాబు సమక్షంలో చోడవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు గండి సింహాద్రి జనసేనలో చేరారు. ఆయనతో పాటు గండి అరుణ క్రాంతి, గండి తాతాజీ, గొల్లుకన్నబాబు, కేతిరెడ్డి జోగి నాయుడు, గొర్లె రాజిబాబు తదితరులు, సుమారు 20 మంది ముఖ్య నాయకులు పార్టీలో చేరారు.ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల అభివృద్ధి కోసం స్థాపించబడిందని, పార్టీ విధివిధానాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. చోడవరం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.పార్టీ ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఈ చేరికలతో నియోజకవర్గంలో జనసేన మరింత బలపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
