జగ్గంపేట, జూలై 13, 2026: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో సోమవారం సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏగుపాటి అర్జున్ రావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల అందిస్తామని ప్రకటించిన ఆర్థిక సహాయం అమలు కాలేదని, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కొత్త అర్హులకు పెన్షన్లు మంజూరు చేయకుండా, మరణించిన లబ్ధిదారుల స్థానంలో మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి అణచివేత ధోరణి అవలంబిస్తోందని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై యూఏపీఏ వంటి చట్టాలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని, దేశాన్ని రక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
జగ్గంపేట నియోజకవర్గంలోని గ్రామాలన్నింటిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై విస్తృత ప్రచార ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు జక్కంపూడి రాజు, నాగులపల్లి రమణ, దిమ్మిత అప్పారావు, ఎన్. లోవరాజు, పినపర్తి నాగు, కోరుకొండ మారిడమ్మ తదితరులు పాల్గొన్నారు.

