
నక్కపల్లి,జిల్లావాణి ప్రతినిధి :
మండల కేంద్రం లోని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం, రానున్న కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, పాయకరావుపేట నియోజకవర్గ టిడిపి కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పాయకరావుపేట నియోజకవర్గంలోని పాల్మన్‌పేటలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభిస్తారని వెల్లడించారు. గత రెండు సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు విస్తృతంగా వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ‘మై టీడీపీ’ యాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని, కార్యక్రమం విజయవంతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం పలు కీలక తీర్మానాలను ఆమోదించి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన టిడిపి అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
