పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి కార్యక్రమం ముందస్తుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి పాఠశాల, అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు ప్రతి ప్రాంతంలో బాధ్యతలు నిర్వర్తించే అధికారులు తమకు కేటాయించిన విధులను పూర్తి అప్రమత్తతతో నిర్వహించాలని, ఎటువంటి చిన్న లోపానికీ అవకాశం ఇవ్వకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని పెందుర్తి వెంకటేష్ పేర్కొన్నారు. పోలవరం జిల్లా ఏర్పాటైన అనంతరం తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమం త్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించను న్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రంపచోడవరంలో హెలిప్యాడ్, పాఠశాల, సభా ప్రాంగణం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, ముఖ్యమంత్రి పాఠశాల సందర్శన, విద్యార్థులతో ముఖాముఖి, మధ్యాహ్న భోజన పథకం పరిశీలన, అనంతరం నిర్వహించే బహిరంగ సభ వరకు ప్రతి కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. సభా ప్రాంగణంలోని గ్యాలరీలో ఉదయం 8 గంటలకే ఆహ్వానితులు, అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన స్థానాల్లో ఆసీనులై ఉండేలా చర్యలు తీసుకోవాలని, గ్యాలరీ ఇన్‌చార్జీలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషా దేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన పోలవరం జిల్లాకు చారిత్రాత్మక సందర్భంగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను ప్రజలకు చేరవేసే అవకాశంగా ఈ పర్యటనను భావించి ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. పాఠశాల విద్యా కమిషనర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా మమేకం కానున్నందున పాఠశాలలో ప్రతి ఏర్పాటును అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులతో జరిగే ముఖాముఖి కార్యక్రమం, తరగతి గదుల పరిశుభ్రత, డిజిటల్ బోధన, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాల పరిసరాల నిర్వహణ తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని కమిషనర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిషనర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, సంబంధిత శాఖల రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

