HomeUncategorizedభావారం భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని ఏపీఆర్సీఎస్ ధర్నా

భావారం భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని ఏపీఆర్సీఎస్ ధర్నా

బాధితుడు పల్లా సూరిబాబుకు న్యాయం చేయాలని డిమాండ్


జగ్గంపేట, ఆగస్టు 3: జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామ పంచాయతీ పరిధిలోని భావారం గ్రామానికి చెందిన పల్లా సూరిబాబు ఇంటి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం (ఏపీఆర్సీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ, భావారం గ్రామానికి చెందిన పల్లా సూరిబాబు ఇంటి స్థలాన్ని పల్లా కృష్ణ అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమ భూమిలోకి ఎందుకు వచ్చావని ప్రశ్నించిన బాధిత కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆక్రమణదారుడు పోలీసులను, అధికారులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. బాధితుడు పలుమార్లు పోలీసు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని, రక్షణ కల్పించాల్సిన పోలీసులే బాధితులను బెదిరిస్తూ ఆక్రమణదారుడికి సహకరిస్తున్నారని విమర్శించారు.
తక్షణమే తహసీల్దార్ జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, అక్రమ ఆక్రమణలను తొలగించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, పీడీఎస్‌యూ (విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి) జిల్లా నాయకురాలు రెడ్డి దుర్గాదేవి, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె. రామలింగేశ్వరరావు, జాను, బాధితులు పల్లా సూరిబాబు, పల్లా లక్ష్మి, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular