పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలు అందిస్తున్న అనకాపల్లి జిల్లా చమ్మచింతకు చెందిన వృక్షమిత్ర అప్పన రాంబాబు మాస్టారుకు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చే ‘ఎట్ హోమ్’ తేనీటి విందుకు ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపికయ్యారు.పర్యావరణ పరిరక్షణలో రాంబాబు మాస్టారు చేస్తున్న సేవలను గుర్తించి ఈ ఆహ్వానం అందింది. 2014లో వృక్షమిత్ర సమితిని స్థాపించిన ఆయన, అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు రెండు లక్షల మొక్కలను పంపిణీ చేయడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా చేపట్టారు.రాంబాబు మాస్టారు సేవలను గుర్తించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ ఆయన పేరును నామినేట్ చేయగా, జిల్లా విద్యాశాఖ అధికారి జి. అప్పారావు నాయుడు ఆయన పేరును ప్రతిపాదించారు. ఈ సందర్భంగా డీవైఈఓ పి. అప్పారావు, జిల్లా ఎన్‌జీసీ కోఆర్డినేటర్ ఖగేశ్, డీఈఓ కార్యాలయ సిబ్బంది వెంకటేశ్వరరావు తదితరులు రాంబాబు మాస్టారును అభినందించారు.వృక్షమిత్రకు గవర్నర్ ఎట్ హోమ్ ఆహ్వానం లభించడం విద్యాశాఖకు గర్వకారణమని నూతన డీఈఓ జీజీఎస్ నాగేశ్వరరావు పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. తాండవం ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, నందికెళ్లి వెంకటరమణ, మండల విద్యాశాఖ అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, చమ్మచింత గ్రామ పెద్దలు రాంబాబు మాస్టారును అభినందించారు.చమ్మచింత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కె. శివరాం ప్రసాద్, ఉపాధ్యాయులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం దశాబ్ద కాలంగా చేస్తున్న కృషికి గవర్నర్ ఎట్ హోమ్ ఆహ్వానం దక్కడం రాంబాబు మాస్టారు సేవలకు లభించిన ప్రత్యేక గుర్తింపుగా స్థానికులు పేర్కొన్నారు.
