HomeUmmadi Alluri Zillaనేడు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ దినేష్...

నేడు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ దినేష్ కుమార్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలో నవంబర్ 26వ తేదీన నిర్వహించనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం ఆయా మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బందిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రాజవొమ్మంగి, రంపచోడవరం మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నామని, పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.మొదటి విడతలో ఐదు మండలాల పరిధిలో మొత్తం 91 గ్రామ పంచాయతీలు, 850 వార్డు సభ్యుల స్థానాలు, 924 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1,35,562 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో భాగంగా మండలాల వారీగా అడ్డతీగలలో 22 పంచాయతీలు, 202 వార్డులు, 222 పోలింగ్ కేంద్రాలు, 30,799 మంది ఓటర్లు; దేవీపట్నంలో 14 పంచాయతీలు, 136 వార్డులు, 150 పోలింగ్ కేంద్రాలు, 20,955 మంది ఓటర్లు; గంగవరంలో 17 పంచాయతీలు, 150 వార్డులు, 150 పోలింగ్ కేంద్రాలు, 21,955 మంది ఓటర్లు; రాజవొమ్మంగిలో 19 పంచాయతీలు, 182 వార్డులు, 200 పోలింగ్ కేంద్రాలు, 31,999 మంది ఓటర్లు; రంపచోడవరంలో 19 పంచాయతీలు, 180 వార్డులు, 202 పోలింగ్ కేంద్రాలు, 29,854 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొండపల్లి (రాజవొమ్మంగి మండలం), వీరవరం (అడ్డతీగల మండలం), జియ్యంపాలెం (గంగవరం మండలం) గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఆయా గ్రామాల్లో అన్ని వార్డు సభ్యుల స్థానాలన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయన్నారు . అదేవిధంగా జగంపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. మొత్తంగా నాలుగు సర్పంచ్ స్థానాలు, 116 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 87 సర్పంచ్ స్థానాలకు 285 మంది అభ్యర్థులు, 734 వార్డు సభ్యుల స్థానాలకు 1,741 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.ఎన్నికల నిర్వహణకు 1,241 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు, 121 సున్నితమైన, 41 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 188 పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ద్వారా పర్యవేక్షణ, మిగిలిన 736 కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించనున్నారు. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో 41 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన ఎన్నికల సిబ్బంది, సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఐదు మండలాల పరిధిలో మొత్తం 1,559 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసినట్లు తెలిపారు. ఐదు మండలాల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే సంబంధిత మండలాలకు చేరవేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఎంసీసీ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. జిల్లా నుంచి మండల స్థాయి వరకు 24 గంటల పాటు కంట్రోల్ రూములు పనిచేస్తున్నాయి.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జి. భాస్కర్ మాట్లాడుతూ, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని మండలాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు, పోలింగ్ సామగ్రి పంపిణీ, రవాణా ఏర్పాట్లు సమన్వ యంతో చేపట్టినట్లు పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించామని, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ చేపట్టినట్లు డీపీఓ జి. భాస్కర్ తెలిపారు.ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి అధికారి, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments