పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలోని దుర్గాదేవి ఆలయం వద్ద మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా

పురోహితులు జలసూత్రం సాంబశివరావు వినాయక పూజ, కుంకుమ పూజ, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. గురుభవాని తోట సూరిబాబు 60 మంది భవానీలకు దీక్ష మాలధారణ చేశారు. ఈసందర్భంగా గురుభవాని సూరిబాబు దీక్ష నియమాలను వివరించారు. 41 రోజుల మండల దీక్షలో ప్రతిరోజూ రెండుసార్లు చన్నీటి స్నానం చేసి పూజలు చేయాలని, అందరినీ భవానీ అని సంబోధించాలని సూచించారు. బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై చాప మీద నిద్రించాలని, మద్యం, మాంసం, ధూమపానానికి దూరంగా ఉండాలని తెలిపారు. అసత్యం పలకరాదని, రోజుకు ఒకపూట ఉల్లి, మసాలాలు లేని ఆహారం తీసుకోవాలని, దీక్షా కాలంలో ఒకరోజు మౌనవ్రతం పాటించాలని వివరించారు. దీక్ష ముగింపు సందర్భంగా విరిముడితో విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని, అనంతరం ఇంటి వద్ద పీఠం పూజ నిర్వహించి దీక్ష విరమించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు జలసూత్రం సాంబశివరావు, గురుభవానీలు తోట సూరిబాబు, మాడెం కళ్యాణం, పోసిన అప్పారావు, ఈకా నాగరాజు తదితరులతో పాటు 60 మంది భవానీలు పాల్గొన్నారు.
