పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. నవంబర్ 29వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో, పోలింగ్ ముగింపునకు 44 గంటల ముందు నుంచే, అంటే శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార నిషేధ కాలం అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.ప్రచార గడువు ముగిసినందున సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఇకపై క్షేత్రస్థాయిలో ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకుల ద్వారా ప్రచారం చేయడం, ఓటర్లను సమీకరించడం వంటి ప్రచార సంబంధిత కార్యకలాపాలకు స్వస్తి పలకాలని సూచించారు.ప్రచార నిషేధ కాలంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నగదు, బహుమతులు లేదా ఇతర ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అభ్యర్థులు, వ్యక్తులపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బంది, పోలీసు యంత్రాంగం సమన్వయంతో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
