HomeUmmadi Alluri Zillaఎన్నికల విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీవో పి.వి.వి.ఎస్. ప్రసాద్ సస్పెన్షన్

ఎన్నికల విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీవో పి.వి.వి.ఎస్. ప్రసాద్ సస్పెన్షన్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలో 2026 గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బందికి అవసరమైన భోజనం, అల్పాహారం, ఇతర కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రంపచోడవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పి.వి.వి.ఎస్. ప్రసాద్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.2026 నవంబర్ 25వ తేదీన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి భోజనం, అల్పాహారం అందించలేదని వార్తలు, దృశ్య మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది ఖాళీ ప్లేట్లు చేతబట్టి రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు.ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బందికి సకాలంలో భోజనం, అల్పాహారం, కనీస వసతులు కల్పించడంతో పాటు ఎన్నికల ఏర్పాట్లను సమన్వయం చేయడం, పర్యవేక్షించడం ఎంపీడీవోగా పి.వి.వి.ఎస్. ప్రసాద్ బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయంలో విధి నిర్వహణలో లోపాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో పాటు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొనడం, నిరసన వ్యక్తం చేయడం జిల్లా ఎన్నికల యంత్రాంగానికి ఇబ్బందికర పరిస్థితి కలిగించిందన్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారికి ఇప్పటికే సంజాయిషీ నోటీసు జారీ చేసి వివరణ కోరినట్లు తెలిపారు. ఘటన తీవ్రత, ఎన్నికల నిర్వహణలో అధికారుల బాధ్యతలు, తదుపరి క్రమశిక్షణా విచారణ అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) నిబంధనలు, 1991లోని రూల్ 8(1), రూల్ 13 ప్రకారం పి.వి.వి.ఎస్. ప్రసాద్‌ను తక్షణమే అమలులోకి వచ్చేలా సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.సస్పెన్షన్ కాలంలో ఆయన ప్రధాన కార్యస్థానం పోలవరం జిల్లా జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి కార్యాలయంగా నిర్ణయించినట్లు తెలిపారు. సంబంధిత అధికారి ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యస్థానాన్ని విడిచి వెళ్లరాదని, తన వద్ద ఉన్న ప్రభుత్వ రికార్డులు, ఫైళ్లు, రిజిస్టర్లు, ఎన్నికలకు సంబంధించిన పత్రాలు, సామగ్రి, ఇతర బాధ్యతలను నియమిత అధికారికి అప్పగించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం జీవనాధార భత్యం పొందేందుకు అర్హత ఉంటుందని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు.ఈ వ్యవహారంపై తదుపరి క్రమశిక్షణా చర్యలను నిబంధనల ప్రకారం చేపట్టేందుకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments