తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ..
నాలుగు మండలాల జనసైనికుల సమైక్య ప్రదర్శన.. 54 కేజీ ల భారీ కేక్ కటింగ్
జగ్గంపేట: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కిర్లంపూడి మండలం రామచంద్రపురంలోని తుమ్మలపల్లి రమేష్ స్వగృహం నుంచి కిర్లంపూడి మండల జనసైనికులతో కలిసి భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ జగ్గంపేట టౌన్‌లోని రావులమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకుంది. రావులమ్మ తల్లి ఆలయం వద్దకు జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని ఒకచోట కలుసుకున్నారు. అనంతరం అందరూ కలిసి రావులమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరింత సేవలందిస్తూ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం నాలుగు మండలాల జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా జగ్గంపేట టౌన్ మొత్తం తిరిగి పాత పోలీస్ స్టేషన్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని 54 కేజీ లతో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను తుమ్మలపల్లి రమేష్ కట్ చేసి జనసైనికులు, అభిమానులతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా రామవరం, బూరుగుపూడి, తామరడ, బ్రిడ్జి, రామచంద్రపురం, వీరవరం, రాజుపాలెం మీదుగా పిఠాపురం చేరుకుని అక్కడ నిర్వహించిన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు, జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 84 గ్రామాల్లో జనసైనికుల కృషితో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పలు గ్రామాల్లో వితంతువులకు నిత్యావసర సరుకుల పంపిణీ, పేదలకు దుప్పట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు తదితర సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పేదలు, నిరుపేదలు, ఆపన్నులకు అండగా నిలవడమే జనసేన పార్టీ లక్ష్యమని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని 84 గ్రామాల్లో జనసైనికులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ జనసైనికులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.


