కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి
కాకినాడజిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు, పెద్దాపురం సబ్‌డివిజన్ డి.ఎస్.పీ పర్యవేక్షణలో మరియు తుని రూరల్ సర్కిల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మార్గదర్శకత్వంలో, కోటనందూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ద్వారా 03.03.2026 (మంగళవారం) రాత్రి కోటనందూరు మండలంలోని సూరపురాజుపేట గ్రామంలో “పల్లె నిద్ర” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలలో శాంతి భద్రతలు బలోపేతం చేయడం, ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెంపొందించడం మరియు సామాజిక వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం ప్రధాన ఉద్దేశ్యంగా చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా కోటనందూరు ఎస్.ఐ. టి. రామకృష్ణ సిబ్బందితో కలిసి గ్రామంలోని సున్నిత ప్రాంతాలను సందర్శించి రాత్రి వేళల్లో పోలీసు పహారా నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజలతో సమావేశం నిర్వహించి మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఉన్న వివాదాలు, వేధింపులు, దొంగతనాలు, మత్తు పదార్థాల వినియోగం వంటి సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
మహిళలపై జరిగే నేరాలు, ఈవ్ టీజింగ్, గృహ హింస, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా అత్యవసర సహాయం కోసం డయల్-112 సేవలు మరియు మహిళా హెల్ప్ డెస్క్ వినియోగం గురించి తెలియజేశారు.
అదేవిధంగా గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలు మరియు చట్టపరమైన చర్యల గురించి వివరించి, గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
గ్రామంలో మద్యం సేవించి గొడవలు చేయడం, జూదం, అనుమానాస్పద సమావేశాలు వంటి విషయాలపై కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు గ్రామ పెద్దలు, యువత మరియు మహిళలతో కలిసి గ్రామ శాంతి కమిటీను బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పోతల సూరిబాబు (మాజీ సర్పంచ్), తాతబాబు, అప్పలనాయుడు (మాజీ ఎం.పి.టి.సి),లోవరాజు మరియు గ్రామస్థులు పాల్గొని పోలీసులకు సహకరించారు.
కోటనందూరు పోలీసులు ప్రజల సహకారంతో గ్రామాల్లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
