HomeNationalవందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

జాతీయ గీతం ‘వందేమాతరం’ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు2026’ను రాజ్యసభ బుధవారం ఆమోదించిన సంగతి తెలిసిందే.వందేమాతర గేయాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చేందుకు మార్గం సుగమమైంది.నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్య గురించి చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో ఆందోళన కొనసాగించారు. ఈ గందరగోళం మధ్యే బిల్లుపై కొద్దిసేపు చర్చించిన అనంతరం సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం1971’ పరిధిలోకి వందేమాతరాన్ని తీసుకురావడమే తాజా సవరణ బిల్లు ఉద్దేశం.ప్రస్తుతం రాజ్యాంగం, జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాలను అవమానించిన వారికి ఈ చట్టం కింద గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. తాజా సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత వందేమాతరాన్ని అవమానించినా, దాని ఆలాపనకు ఆటంకం కలిగించినా లేదా ఆలాపన సమయంలో ఉద్దేశపూర్వకంగా అంతరాయం సృష్టించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు.బంకించంద్ర ఛటోపాధ్యాయ 1875లో రచించిన వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ బిల్లును తీసుకొచ్చింది. వందేమాతరం తొలిసారిగా 1882లో ఆయన రచించిన ‘ఆనందమఠం’ నవలలో ప్రచురితమైంది. గత కొన్ని నెలలుగా అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆలాపనకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు కూడా జారీ చేసింది.జులై 24న రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును జులై 29న చర్చ అనంతరం ఆమోదించారు. ఆ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్.. దేశ గౌరవాన్ని, సాంసృ్కతిక వారసత్వాన్ని పరిరక్షించడమే ఈ బిల్లు ఉద్దేశమని తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి, జాతీయ చైతన్యానికి వందేమాతరం ప్రతీకగా నిలిచిందన్నారు. బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. జాతీయ చిహ్నాలను అవమానించకుండా కఠిన నిబంధనలు అవసరమని కొందరు సమర్థించగా, ఇలాంటి అంశాల్లో విసృ్తత ఏకాభిప్రాయం, సమగ్ర చర్చ అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular