పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: గోదావరి, శబరి వరదల ప్రభావం అనంతరం చింతూరు డివిజన్‌లో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోందని, పోలవరం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా సహాయక, పునరావాస చర్యలను కొనసాగిస్తోందని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. చింతూరు డివిజన్‌లో గోదావరి, శబరి వరదల ప్రభావం ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. నీటి మట్టాలు గణనీయంగా తగ్గడంతో పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలు దశలవారీగా తమ ఇండ్లకు తిరిగి చేరుకోవడం జరిగిందన్నారు. మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 28.80 అడుగులకు, చింతూరు వద్ద శబరి నీటి మట్టం 20.10 అడుగులకు తగ్గిందన్నారు. ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు నమోదైన 56.10 అడుగుల అత్యధిక వరద మట్టంతో పోలిస్తే ప్రస్తుతం నీటి ప్రవాహం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. చింతూరు డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఏటపాక మండలాల్లో మొత్తం 77 గ్రామాలు/ఆవాసాలు ప్రభావితమయ్యాయని, 10,828 కుటుంబాలు, 34,358 మంది ప్రజలు వరద ప్రభావాన్ని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. 1,073 ఇళ్లు నీట మునిగినట్లు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలతో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 750 కుటుంబాలకు చెందిన 2,124 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. 149 మంది గర్భిణులను ముందస్తుగా వైద్య సేవల కోసం సీహెచ్‌సీలకు తరలించగా, 65 వైద్య శిబిరాలు నిర్వహించి 1,354 మందికి చికిత్స అందించినట్లు వెల్లడించారు. అవసరమైన మందులు, యాంటీ స్నేక్ వెనం, డాగ్ బైట్ వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని, పీహెచ్‌సీలకు శాశ్వత జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, ఏటపాక మండలాల్లో పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు తదితర నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతోందన్నారు. మొత్తం 11,801 కిలోల చొప్పున అవసరమైన సరుకులు సరఫరా చేయగా, ఎక్కువ భాగం ఇప్పటికే పంపిణీ చేసినట్లు తెలిపారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాలు, చెట్ల తొలగింపు, రహదారుల పర్యవేక్షణ తదితర చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పారు. వరదల సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఒక పశువు మరణించిన విషయం నమోదు అయినట్లు తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ తదితర శాఖలు 24 గంటలు పనిచేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలిస్తున్నామని, అధికారులు అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని ఇప్పటికే ఆదేశించినట్లు కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికార యంత్రాంగం సూచనలు పాటించాలని ఆయన కోరారు.
