పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: గోదావరి, శబరి వరదల ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం కూనవరం మండలం తాళ్లగూడెం, బొజ్జరాయిగూడెం గ్రామాలలో వరద బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి , సబ్ కలెక్టర్ శుభం నొక్వల్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం యాటపాక మండలంలోని ప్రభావిత గ్రామాలకు సరుకుల పంపిణీ కోసం సాయంత్రం అధికారులు బయలుదేరారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, చింతూరు డివిజన్‌లో సుమారు 70 గ్రామాలు ముంపు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని, మొత్తం 11,900 కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభావిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని చెప్పారు. సోమవారం టేకుపాక గ్రామం నుంచి వరద ప్రభావం నేపథ్యంలో ముంపు గ్రామాల్లో కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మంగళవారం సాయంత్రం నాటికి అన్ని గ్రామాల్లో పంపిణీ పూర్తి చేసేలా ప్రణాళిక అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి ఒక ప్యాకెట్ పామాయిల్, 1 కిలో ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, 1 కిలో

పప్పు మరియు బియ్యం అందజేస్తున్నామని తెలిపారు. అదనంగా, ఆగస్టు నెల రేషన్‌తో పాటు సెప్టెంబర్ నెల రేషన్‌ను కూడా ముందస్తుగా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అవసరమైన రేషన్ సరుకులలో కొంత భాగం సోమవారం చింతూరుకు చేరిందని, మిగిలిన సరుకులు చేరుకున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలోని ప్రతి ప్రభావిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా అధికారులు చర్యలు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
