పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని మండలం పెద్దగెద్దాడ ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ రంపచోడవరం నియోజవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీషాదేవి ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల విద్యా, వసతి గృహాలలోని సౌకర్యాలను ఎమ్మెల్యే శిరీష దేవి పరిశీలించారు. అంతేకాకుండా పాఠశాలోని తరగతి గదులు, విద్యార్థుల వసతి, భోజన ఏర్పాట్లు, తాగునీరు, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను కూడా ఎమ్మెల్యే ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో శిరీష దేవి స్వయంగా మాట్లాడి అక్కడ సదుపాయాలపై ఆరా తీశారు.

ముఖ్యంగా ఉపాధ్యాయుల బోధనపై అర్థమవుతున్నది లేనిది దానిపై అడిగితెలుసుకున్నారు. అలాగే పాఠశాలో ఏర్పాటు చేసిన అంతరిక్ష విజ్ఞాన ప్రదర్శనను ఎమ్మెల్యే శిరీష దేవి ఆసక్తిగా తిలకించారు. ఇస్రోకు సంబంధించిన అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహాలు, చంద్రయాన్-3 తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న తీరును అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన వసతి సౌకర్యాలు, పరిశుభ్రమైన

వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో

మమేకమైన ఎమ్మెల్యే, వారి చదువులు, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. గిరిజన విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని శిరీషాదేవి తెలిపారు.
