జగ్గంపేట, కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. చెన్నారావు గారి ఆధ్వర్యంలో కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. చెన్నారావు గారు మాట్లాడుతూ భారతదేశ గ్రంథాలయ రంగానికి విశేష సేవలందించిన డా. ఎస్. ఆర్. రంగనాథన్ గొప్పతనాన్ని, ఆయన గ్రంథాలయాల అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. గ్రంధాలయం విజ్ఞాన భాండాగారం వంటిది అని, గ్రంథాలయాలు విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, పఠనాసక్తిని, పరిశోధనా దృక్పథాన్ని మరియు విజ్ఞానాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. డా. ఎస్. ఆర్. రంగనాథస్ గ్రంథాలయ శాస్త్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన సూచించిన గ్రంథాలయ సూత్రాలు నేటికీ గ్రంథాలయ నిర్వహణలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని తమ జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవాలని ఆయన సూచించారు.
అనంతరం కళాశాల గ్రంథాలయ ఇస్చార్జి డా. డి. సత్యలత గారు మాట్లాడుతూ గ్రంథాలయ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధిలో గ్రంథాలయం ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తుందని, పాఠ్యపుస్తకాలతో పాటు వివిధ రకాల పుస్తకాలు, పత్రికలు, పరిశోధనా గ్రంథాలు మరియు ఇతర సమాచార వనరులను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతిరోజు కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయించడం ద్వారా విద్యార్థులు తమ విజ్ఞానాన్ని, భాషా నైపుణ్యాలను మరియు ఆలోచనా శక్తిని పెంపొందించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ.సి. హెచ్. బాలరాజు గారు, ఐ. క్యూ. ఏ. సి కో-ఆర్డినేటర్ డా. పి.వి.వి. సత్యా నారాయణ గారు, మరియు అకడెమిక్ కో-ఆర్డినేటర్ డా.జి. సురేష్ గారు, ఫిజిక్స్ ఆధ్యాపకులు పి. శేఖర్ గారు, కామర్స్ ఆధ్యాపకులు పి.పద్మ శేఖర్ గారు, కంప్యూటర్ ఆధ్యాపకులు వి.దేవి ప్రసన్న గారు, హిస్టరీ ఆద్యాపకులు ఆర్. శ్రీనుగాడు, ఇతర అధ్యపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.


