HomeUncategorizedజగ్గంపేట పట్టణానికి పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి

జగ్గంపేట పట్టణానికి పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి

నూతన సీహెచ్‌సీ వద్ద జాతీయ రహదారిపై ఓపెనింగ్ ఏర్పాటు చేయాలి

తాళ్లూరు లిఫ్ట్ పనులు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలి

– జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి రఘురామ్

జగ్గంపేట, ఆగస్టు 12: కాకినాడలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి రఘురామ్ పాల్గొని జగ్గంపేట ప్రాంతానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను జిల్లా పరిషత్ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ప్రజల తరఫున వినతిపత్రం సమర్పించారు. జగ్గంపేట పట్టణంలో పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో జగ్గంపేటలో ఉన్న సీహెచ్‌సీని నూతన భవనం నిర్మాణం అనంతరం గండేపల్లి మండల పరిధిలోకి మార్చడంతో జగ్గంపేట పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలు వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు, పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని జగ్గంపేట పట్టణంలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయడం అత్యవసరమని అధికారులను కోరారు. అదేవిధంగా నూతన సీహెచ్‌సీ వద్ద జాతీయ రహదారిపై సరైన ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. హైవేపై సరైన ఓపెనింగ్ లేకపోవడంతో వాహనదారులు రాంగ్ రూట్‌లో ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల ప్రమాదాలకు అవకాశం ఉందని తెలిపారు. రోగులు, అంబులెన్సులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక ఓపెనింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నత్తనడకన సాగుతున్న విషయాన్ని కూడా సమావేశంలో ఆమె ప్రస్తావించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను ఆరా తీసి, ఆలస్యానికి గల కారణాలను పరిశీలించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయితే జగ్గంపేట మండలంలోని పలు గ్రామాల రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి వ్యవసాయానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. జగ్గంపేట ప్రాంత ప్రజలకు సంబంధించిన వైద్యం, రహదారి భద్రత, సాగునీటి సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పరిష్కారం చూపాలని జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి రఘురామ్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular