HomeAndhra Pradeshఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు

జిల్లావాణి ప్రత్యేక కథనం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఉల్లి,ఎండు మిర్చి, చక్కెర, వంట నూనెలు ఇలా రోజువారీ సరుకులన్నీ అమాంతం పెరిగిపోయి సామాన్యుడిని చతికిల పడేస్తున్నాయి. ప్రధానంగా ఉల్లి, మిరప వంట నూనెల ధరలు గతేడాదితో పోల్చితే భారీగా పెరిగాయి. గతేడాది ఆగస్టులో ఉన్న ధరలకూ, ఈ నెలలో ధరలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఉల్లి ధర ఏకంగా 83 శాతం వరకు పెరుగుదల నమోదు కాగా, ఎండుమిరప ధర కూడా 54 శాతం వరకు పెరుగుదల కనిపించింది. ప్రణాళికా శాఖ నివేదికలో ఇతర నిత్యావసరాలు కూడా పెరిగినట్టు తేలింది. పెరుగుతున్న ధరలు వినియోగదారులపై భారం పెంచుతున్నాయి.

ముఖ్యంగా ఎండు మిరపకాయలు, ఉల్లిపాయలు, వంట నూనెలు, కందిపప్పు ధరలు ఏడాది కాలంలో గణనీయంగా పెరిగాయి. గత నెలతో పోల్చిచూసినా పెరుగుదల ఎక్కువగానే కనిపిస్తోంది. ధరల పెరుగుదలలో ఎండు మిరపకాయలు ముందంజలో ఉన్నాయి. గ్రేడ్-1 మిరపకాయ కిలో ధర రూ.282.39గా నమోదైంది. గతేడాది రూ.176.55 ఉండగా, ఏడాది కాలంలో రూ.112.24 వరకు పెరగడం గమనార్హం. ఇది ఏకంగా 63.57 శాతంగా ఉంది. గ్రేడ్-2 ఎండు మిరపకాయల ధర రూ.253.35గా ఉండగా, ఏడాదిలో 65.81 శాతం పెరిగింది. *ఉల్లి ధరల్లో భారీగా..* ఉల్లిపాయల ధరలు కూడా వినియోగదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. గ్రేడ్-1 ఉల్లి కిలో రూ.52.62గా ఉంది. గతేడాది రూ.29 ఉంది. ఏడాది కాలంలో ధర 75.14 శాతం పెరిగింది. గ్రేడ్-2 ఉల్లి ధర 45.35 కాగా, గత నెలతో పోలిస్తే 37.52 శాతం, గతేడాదితో పోలిస్తే ఏకంగా 83.35 శాతం పెరిగింది. బయట మార్కెట్లో అయితే కిలో రూ.60 పైనే అమ్ముతున్నారు. *నూనె ధరలూ పైకే..* వంట నూనెల ధరల్లోనూ ఏడాది కాలంలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరుకు రూ.177.22గా ఉండగా, ఏడాదిలో 21.40 శాతం పెరిగింది. పామాయిల్ రూ.152.54 ఉండగా, గతేడాది రూ.129 ఉంది. వేరుశనగ నూనె రూ.159 నుంచి రూ.183.46 వరకు పెరిగింది. కందిపప్పు ధరలు కూడా వినియోగదారులపై భారంగా మారాయి. గ్రేడ్-1 కందిపప్పు కిలో రూ.133.10గా ఉండగా, గతేడాది రూ.117గా ఉంది. గ్రేడ్-2 ధర 121.93తో 14.56 శాతం పెరిగింది. *బియ్యం ధర కూడా..* బియ్యం ధరలు కూడా ఏడాది కాలంగా పైకి ఎగబాకుతున్నాయి. సూపర్‌ఫైన్ గ్రేడ్-1 బియ్యం 11.45 శాతం, ఫైన్ రకం 13.57 శాతం, సాధారణ గ్రేడ్-2 12.02 శాతం పెరిగాయి. మిగతా వస్తువులతో పోలిస్తే చింతపండు ధరల్లో పెరుగుదల తక్కువగా ఉంది. గ్రేడ్-1 2.27 శాతం పెరిగింది. సాధారణ రకం 5.19 శాతం, మూడో రకం 10.49 శాతం పెరిగాయి. *ఆకాశాన్నంటున్న చక్కెర ధరలు* అన్ని ధరలతోపాటు రాష్ట్రంలో చక్కెర ధరలు కూడా

గణనీయంగా పెరిగాయి. ఈ నెల ఆరంభంలో కిలో రూ.45 వరకు ఉన్న ధర తాజాగా రూ.65 వరకు పెరిగింది. దీంతో రోజువారీ ఇంట్లో వినియో గించేవారితో సహా హోటళ్లు, బేకరీలపై కూడా దీని ప్రభావం ఎక్కువగా పడుతోంది. చెరుకు పంట తగ్గిపోవడం వల్లే అని అధికారులు చెబుతున్నప్పటికీ ఇథనాల్‌ ‌కోసం చెరుకును మళ్లించడం ద్వారా సాధారణ చక్కెరపై ఈ ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular