పోలవరం జిల్లావాణీ ప్రతినిథి : గిరిజన సంక్షేమ శాఖ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న పాప అనే విద్యార్థిని హాస్టల్ భవనంలోని మెట్ల మార్గంలో జారిపడి కాలుకు గాయం కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను జాయింట్ కలెక్టర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్య ప్రకాశరావును ఆదేశించారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థిని తల్లితో జాయింట్ కలెక్టర్ మాట్లాడి, విద్యార్థినికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థినికి మెరుగైన చికిత్స అందేలా జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల సంఖ్య, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య తదితర వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాదులకు అవసరమైన ఉచిత మందులు అందించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.వివిధ రకాల మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్య ప్రకాశరావు, వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
