అనకాపల్లి మాకవరపాలెం మండలంలో మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మాకవరపాలెం మండలం శేట్టిపాలెంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) జీఎం దేవరాజ్ తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీన ఈ యూనిట్‌కు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.శేట్టిపాలెంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని జీసీసీ జీఎం దేవరాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2025 మే నెలలో ప్రభుత్వం 12 ఎకరాల భూమిని కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ కోసం కేటాయించిందన్నారు.యూనిట్ అందుబాటులోకి వస్తే సుమారు 500 మంది మహిళలకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని దేవరాజ్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ సాగుకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీసీసీ అధికారి విశ్వనాథం, శేట్టిపాలెం మాజీ సర్పంచ్ అల్లూ రామనాయుడు తదితరులు పాల్గొన్నారు.
