జగ్గంపేట, ఆగస్టు 31: గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఐ తిరుపతిరావు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర దుష్ప్రభావాలు ఏర్పడతాయని వివరించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జగ్గంపేట సీఐ 9440786529, ఎస్సై 9440796569 లేదా డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

