. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జ్యోతుల మణిమ్మ
. 108 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజలు.. హాజరైన జ్యోతుల నవీన్
జగ్గంపేట: కాకినాడ జిల్లా జగ్గంపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్యవైశ్య సేవా సంఘం మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 1021వ జయంతి ఉత్సవాల్లో భక్తులు పోటెత్తారు. ఉదయం అమ్మవారిని ప్రత్యేక రథంపై పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించగా, కళ్యాణ మండపంలో 108 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి శ్రీమతి జ్యోతుల మణిమ్మ, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ విశిష్ట అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాసవి మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఆర్యవైశ్యులందరికీ చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు జ్యోతుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కొత్త కొండబాబు, పలువురు ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

